top of page
Search
Writer's pictureDr V V S Narayana Nakkina

మహిళలపై టెలివిజన్ సీరియల్స్ ప్రభావం

Updated: May 26, 2020

మానవుడు సాధించిన ఎన్నో పురోగతులలో నేటి ఆధునిక సాంకేతికత ఒకటి. ఈ సాంకేతికత అబివృద్దిలో టెలివిజన్ 1980’s లో మొదలయ్యి 1990’s లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన మాద్యమం. ముఖ్యంగా భారతదేశంలో వీటి వాడకం పట్టణాలు, పల్లెటూర్లు ఇంకా చిన్న చిన్న కొండప్రాంతలకు కూడా బాగా విస్తరించింది, ప్రతీ ఇంటిలోనూ టెలివిజన్ అనేది నిత్యవసరం అయిపొయింది. టీవీ లేకపోతే చిన్నపిల్లలు భోజనం కూడా చేయడంలేదు, గృహిణిలకు తోచుబాటు లేదు, మగవారికి ముచ్చట్లు చెప్పె స్నేహం అయిపొయింది. ఈ టెలివిజన్ ఆవిర్భావం ఎలా జరిగినప్పటికీ మన నట్టింట్లో సందడి చేస్తూ కుటుంభ సభ్యులందరినీ నవ్విస్తూ, ఏడిపిస్తూ, సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ మనలో ఒకరిగా మనతోపాటే మేలుకోంటూ, మనల్ని నిద్రపుచ్చేవరకు తోడుగా ఉండి, మన దినచర్యలో తనకి సుస్థిర స్థానాన్ని ఎవరికీ చెప్పకుండా ఎవరినీ అడగకుండా తనకితానె ఏర్పరుచుకుంది మన టెలివిజన్. ఎన్నో కబుర్లు, మరెన్నో విషయాలు, వాతావరణం, రాజకీయాలు, సినిమాలు, ఇవే అని చెప్పలేము ప్రపంచాన్ని తెచ్చి మన ముంగిట్లో ఉంచింది.

మన దేశంలో గత దశాబ్దంగా డైలీ సీరియల్స్ ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది, రాత్రనక పగలనక మన ఇళ్ళల్లో సీరియల్స్ బాగా ఆదరించబడుతున్నాయి. ఈ సీరియల్స్ చూడని వ్యక్తులు లేరు అంటే అతిశయోక్తికాదు, ఈ డైలీ సీరియల్స్ మహిళల మానసిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు తీసుకు వచ్చాయి. పాఠశాలకు వెళ్లే బాలికల నుండి 60,70 ఏళ్ల ముసలమ్మల వరకు కూడా ఈ టెలివిజన్ సీరియల్స్ అనే పెనుభూతం ఎంతగానో పట్టిపీడిస్తోంది.ఈ టెలివిజన్ సీరియల్స్ కు ఇంతగా బానిసలు అవ్వడానికి కారణం స్త్రీలు భావాలకు, భావోద్వేగాలకు సులువుగా లోనవుతారు కాబట్టి. మహిళల బావోద్వేగాలను ఆసరాగా తీసుకొని చాలా టెలివిజన్ ఛానళ్ళు రకరకాల డైలీ సీరియల్స్ టెలికాస్ట్ చేస్తున్నారు, చాలా చానెళ్ళ TRP రేటింగ్ ఈ సీరియల్స్ పైనే ఎక్కువ అడ్డరపడి ఉంది. ఈ సీరియల్స్ కారణంగా చాలా మంది మహిళలల మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది, అంతేకాకుండా మహిళలు ఈ సీరియల్స్ అనే ఉచ్చులోపడి తెలియని వేదనను, ఆతృతను, సందిగ్ధతను అనుభవిస్తున్నారు. ఈ టెలివిజన్ సీరియల్స్ వలన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల వలన వచ్చే సమస్యలను తెలుసుకుందాం.


మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు

ఆందోళన: టెలివిజన్ సీరియల్స్ చూసే మహిళలు ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారు ఎందుకనగా ఈరోజు వచ్చిన ఎపిసోడ్ ని చూసి అందులో పూర్తిగా లీనమై రేపటి భాగంలో ఏమౌతుందని ఆరాటపడతారు అదే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ రేపటి భాగంలో ఏం జరుగుతోందని తను ఊహించినట్లు జరుగుతుందా లేదా వేరే విధంగా జరుగుతుందా అని ఆందోళనకు గురి అవుతున్నారు. అంతేకాకుండా సీరియల్స్ లో పాత్రలను ఉహించుకొంటూ వారి బాధలను తలుచుకుంటూ ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారు.

బానిసత్వం కావడం/ వ్యసనపరులు కావడం: ఇక్కడ బానిసత్వం అనగా టీవీ సీరియల్స్ కు వ్యసనపరులు కావడం ఒక్క రోజు టీవీ సీరియల్స్ రాకపోయేసరికి చిరాకు పడిపోవడం, ఏమి చెయ్యాలో తోచక ఎదుటివారిపై ఆ చిరాకు చూపడం చిన్న చిన్న విషయాలకు నిందించడం, అనవసరంగా కోపం తెచ్చుకోవడం, పరిస్థితులు మరీ విషమంగా ఉన్న సమయంలో స్వీయ హాని తల పెట్టుకోవడం లేదా ఎదుటివారిని హాని చేయడం జరుగుతుంది. శని, ఆదివారాలలో సీరియల్స్ ప్రసారంకాకపోతే వాటి గురించి సోమవారం వరకు నిరీక్షించడం, వాటి గురించి తెలియని బెంగకు లోనవ్వడం. ఈ కారణాలు భానిసత్వానికి దారితీస్తున్నాయి.


భావోద్వేగాల అసమతుల్యత (లేదా) మానసిక అస్థిరత: మహిళలు సున్నిత మనస్తత్వం కలవారు కాబట్టి సులువుగా భావోద్వేగాలకు లోనవుతారు. ఏ విధమైనటువంటి భావోద్వేగ విషయం సీరియల్స్ లో ప్రదర్శింపబడుతుందో ఆ విధమైన ప్రవర్తనను వ్యక్తపరుస్తారు .ఉదాహరణకు వారు సీరియల్స్ లో బాధాకరమైన విషయాన్ని చూస్తే ఆ బాధ వాళ్ళదే అనుకునేలా బాధ పడిపోతారు .అదేవిధంగా ఆనందదాయకమైన సన్నివేశం వచ్చినప్పుడు వీళ్ళు అమితానందానికి గురి అవుతారు. ఈ విధంగా అన్ని భావాలను ప్రదర్శిస్తారు. భావోద్వేగాల అసమతుల్యత అనేది టెలివిజన్ వరకు ఉండిపోదు, అది నిజ జీవితంలో చాలా ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాలలో ఈ సీరియల్స్ లో పాత్రలను అనుసరిస్తున్న మహిళలు చాలా మంది ఉన్నారు.

మానవ సంబంధాల సమస్యలు: మహిళలు టీవీ సీరియల్స్ లో మమేకమై ఆయా సమయాల్లో కుటుంబ సభ్యులను ,బంధువులను, స్నేహితులను పట్టించుకోక పోవడం వలన వారి మధ్య బేదాభిప్రాయాలు, వాదోపవాదాలు వచ్చి కుటుంభ వాతావరణంలో మార్పులు రావడం మూలన సత్సంభందాలు దెబ్బతింటున్నాయి. ఈ సీరియల్స్ రాత్రి భోజనం వేళ లో కూడా రావడం వలన ఇంట్లో ఉన్న పెద్దవారికి భోజన సదుపాయం సరిగ్గా చేయకపోవడం వలన వారి మధ్య దూరము ఏర్పడి అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పిల్లలను పట్టించుకోకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు, చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. ఈ విధంగా మహిళలకు నిర్లక్ష్యం, కోపం, వంటివి ఈ సీరియల్స్ వలన తెలియకుండా అలవరుచుకుంటున్నారు.

చెడు ప్రభావానికి ఆకర్షితులవ్వడం: ఈ టెలివిజన్ సీరియల్స్ లో వచ్చే పాత్రలు మంచి కన్నా చెడు విషయంలో ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ప్రదాన విలన్ పాత్రలలో కనిపిస్తున్నారు, మహిళలే మహిళలకు శత్రువులుగా వ్యవరించడం అంతేకాక చాలావరకు ఈ సీరియల్స్ పగపూరితమైన కధ మరియు కధనంతో సాగుతున్నాయి. ఇటువంటి సీరియల్స్ వలన చిన్నపిల్లలు కూడా బాగా చెడుకి దగ్గరవుతున్నారు. ఉదాహరణకు ఏదో ఒక సీరియల్ లో చూపించిన విధంగా అత్త కోడలను హింసించడం, కోడలు అత్తమామల్ని సరిగ్గా చూడకపోవడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం , తనకి నచ్చని వారి పై కుట్రలు పన్ని వారిపై హత్యా యత్నాలు చేయడంవంటివి నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాము. మహిళలు ఈ విధంగా టీవీ సీరియల్స్ నుండి చెడు ప్రవర్తనను అలవాటు చేసుకుంటున్నారు. మహిళలే కాకుండా ప్రతీ టెలివిజన్ ప్రేక్షకుడు ఈ చెడుకి బాగా చేరువవుతున్నారు. మంచికన్నా చెడు తొందరగా ప్రభావం చూపుతోంది కదా.

శారీరక శ్రమ తగ్గిపోవడం: మహిళలు తదేకంగా సీరియల్స్ చూడటం వల్ల కళ్లు అలసటకు గురి కావటం దాని కారణంగా నిద్ర సరిగ్గా పట్టకపోవడం తద్వారా విచిత్రమైన ఆలోచనలు రావటం జరుగుతుంది. ఆహారం పై దృష్టి పెట్టకుండా తినటం వలన అజీర్ణతకి గురి అవ్వటం. ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వల్ల ఊబకాయం రావటం వంటివి జరుగుతున్నాయి. ఈ సీరియల్స్ లోని భావోద్వేగాలవలన శరీరంలో ఉత్పన్నమయ్యే అనేకరకాల హార్మోనుల అసమతుల్యత కారణంచేత మహిళలు అనేకరకాల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఆధునిక సమాజంలో వంటగదిలో ఎలెక్ట్రానిక్ పరికరాలు వాడకం ఎక్కువవడం వలన మహిళలకు శారీరక శ్రమ తక్కువవడం గమనిస్తున్నాం, దీనికి ఈ సీరియల్స్ ప్రభావం తోడవడం వలన కొత్తసమస్యలను ఎదుర్కొంటున్నారు.

సమయాన్ని వృధా చేయటం: మహిళలు ఇంటి పనులు మరియు స్వయం ఉపాధి పనులు కూడా మానుకుని గంటల తరబడి టీవీ సీరియల్స్ చూస్తున్నారు. దీని కారణంగా వారి కుటుంబ ఆదాయం తగ్గి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచనలో ఉత్పాదకత తగ్గుతుంది. స్వయంగా ఆలోచించే శక్తి క్రమంగా క్షీణిస్తుంది. టెలివిజన్ సీరియల్స్ చూడటమే కాకుండా వాటిపై తోటి వారితో చర్చలు జరపడం వల్ల కూడా రోజువారీ కార్యకలాపాలకు భంగం కలుగుతుంది. చాలా సమయాన్ని ఈ సీరియల్స్ గురించి మాట్లాడుకోవడం, చుసిన సీరియల్స్ని మళ్ళి మళ్ళి చూడడం వలన వృదా చేసుకుంటున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఎంత ముఖ్యమైన పని ఉన్నాసరే సీరియల్ సమయానికి వాటిని వాయిదావేయడం లేదా వదిలివేయడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి.

శారీరక / అలంకరణ అవసరాలు: ఆడవాళ్లు అలంకార ప్రియులు కావటం వలన టీవీ సీరియల్స్ లో చూపించే వస్త్రాభరణాలకు ముగ్దలు అవుతున్నారు. వారి ఆర్థిక స్తోమత సరిపోకపోయినా వాటిపై మనసు పడుతున్నారు మరియు పాత్రధారులు యవ్వనంగా కనిపించుట వలన వీరు కూడా ఆ విధంగా కనిపించాలని వేషధారణ చేస్తున్నారు. ఉదాహరణకు సీరియల్స్ లో అత్త మరియు తల్లి పాత్రలను చిన్నవయసువారు నటించటం వలన వారి పాత్రకు వయసుకు చాలా తేడా ఉంటుంది, దీనికారణంగా చాలామంది నడివయస్సు మహిళలు ఈ పాత్రలలో ఉన్న మహిళల శారీరక ఆకృతులను అనుకరించుట వలన నిరాశకు గురవుతున్నారు. అంతేకాకుండా మహిళలు ఈ సీరియల్స్ ఆలోచనల్లో ఉండి శారీరక/ అలంకరణ అవసరాల పై కోరికలు పెరిగి ఆ కోరికలు నేరవేర్చుకోలేక కృంగిపోతున్నారు. ఇంకా అనేక కారణాలవల్ల ఈ టీవీ సీరియల్స్ నుండి మహిళలు మానసికంగా బాధ పడుతున్నారు.


మహిళలపై టీవీ సీరియల్ ప్రభావాన్ని అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు

టీవీ సీరియల్స్ కు వ్యసనపరులైన మహిళలు ఒక్కసారిగా మానుకోవడం కష్టం కావున ఆ సమయంలో వేరే కార్యక్రమాలు చేయడం వలన అరికట్టవచ్చును.

  • టీవీ సీరియల్స్ వచ్చే సమయంలో పిల్లలకు చదువులో సహాయపడటం మరియు వారితో సమయాన్ని గడపడం.

  • కుటుంబ సభ్యులతో కలిసి ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం.

  • స్వయం ఉపాధిని కల్పించుకోవడం కుట్టుమిషన్లు, అల్లికలు వంటివి నేర్చుకోవడం లేదా వచ్చిన పనులు చేసుకోవడం.

  • పుస్తక పఠనం అలవరుచుకోవడం.

  • శారీరక వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకోవటం.

  • ఇంటి పనులు సక్రమంగా చేసుకోవడం.

  • అందరూ కలిసి ఇంట్లో టీవీ చూడడం మానుకోవటం.

  • వేరే కార్యకలాపాలు చేస్తున్నప్పుడు సీరియల్ చూడటం మానుకోవాలి.

  • కొంత సమయాన్ని కేటాయించి ఆ సమయంలో మాత్రమే సీరియల్స్ చూసే అలవాటు చేసుకోవాలి, రోజులు గడిచే కొద్దీ ఆ అలవాటును తగ్గించుకోవాలి

  • కొత్త సీరియల్స్ ని మొదలుపెట్టకుండా, పాతవి అవ్వగానే ఇక స్వస్థి చెప్పడం.


రచన: G.L.M నాయుడు

సంపాదకులు: డా. నారాయణ నక్కిన

*Note: All these pictures are taken from Google free sources.

233 views3 comments

3 Comments


Vineela Kvc
Vineela Kvc
May 24, 2020

Good msg for womens

Like

sireesha narayana
sireesha narayana
May 18, 2020

చాలా బాగుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ కవర్ చేశారు.

Like

This very informative and well narrated

Like
bottom of page